కరుణకు పదవి.. జయకు డబ్బు..

02:47:00

డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి పదవి ఆశ పట్టుకుందని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్‌ ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా భారీగా డబ్బు కూడగట్టుకోవాలని తాపత్రయ పడుతున్నారని కూడా పేర్కొన్నారు. మదురై జిల్లా తిరుమంగళంలోని దేవర్‌ మైదానం సమీపంలో పార్టీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. అందరిలా తాను కాగితాల్లో రాసుకొచ్చిన ప్రసంగాలు చేయనని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏది అవసరమో, పాలకపార్టీ చేస్తున్న ద్రోహమేంటోనన్న అంశాలపై మాట్లాడేందుకు రాసుకుని రావాల్సిన పనిలేదన్నారు. జయలలిత 110వ నిబంధన కింద ప్రకటించినవన్నీ నెరవేర్చినట్లు ఇటీవల ఓ ప్రకటన జారీ చేశారని గుర్తుచేశారు. దాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. తొంభై ఏళ్లు దాటిన కరుణానిధికి ఆరోసారి ముఖ్యమంత్రి కావాలన్న దురాశ పుట్టిందని విమర్శించారు. జయలలితకు అంతకు మించి పెద్దస్థాయిలో డబ్బు వెనకేసుకోవాలన్న ఆశ కలిగిందని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీగా కెప్టెన్‌ అభివర్ణించారు. ప్రజలు తప్పకుండా తమ కూటమినే గెలిపిస్తారని చెప్పారు. ‘చెప్పింది చేశా.. చెప్పనవి కూడా చేశాన’ని జయలలిత మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ‘ప్రజలను నానా అవస్థల పాలు చేస్తాన’నే మాటను ఆమె చెప్పకుండానే ఐదేళ్లపాటు చేశారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే నేతలు నిబంధనలు పాటించకున్నా ప్రధాన ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల ప్రచారసభలో ప్రజలకు కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణమంటే జయలలితకు అంత అలుసుగా మారిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ విషయాలపై తప్పకుండా విచారణ చేయిస్తామని తెలిపారు. తాను ఇలాంటి పార్టీలకు ఏమాత్రం భయపడబోనని, ప్రజల మద్దతు ఈసారి తమ కూటమికే ఉందని ధీమా వ్యక్తం చేశారు. కరూర్‌లో ఇప్పటివరకు రూ.వంద కోట్లు, రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వస్తున్న విషయాన్ని కెప్టెన్‌ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Share this

Related Posts

Previous
Next Post »