అమరులకు నివాళితో ప్రారంభమైన ప్లీనరీ సమావేశంలో భాగంగా 15 తీర్మానాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. సంక్షేమ పథకాల ఆధారంగా తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - పార్టీ నాయకులు - కార్యకర్తల రాకతో ఖమ్మం గులాబీమయంగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షోపదేశం చేశారు. 15 ఏళ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించామన్నారు. ప్రపంచానికే భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం చేశామని కేసీఆర్ చెప్పారు. ధీరులు అవరోధాలను అధిగమించి లక్ష్యం వైపు ముందుకెళ్తారనే సందేశం ఇందులో అంతర్లీనంగా ఉందన్నారు. టీఆర్ ఎస్ శ్రేణులు అవమానాలను - అవహేళనను తట్టుకొని తెలంగాణ కోసం ఉద్యమించారని గుర్తు చేశారు.
మే నెల ముగిసే సమయానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని వెల్లడించారు. 3500 నుంచి 4వేల మంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని స్పష్టం చేశారు. పదవులు వచ్చినవారే గొప్పవాళ్లు కారని రానివాళ్లు చిన్నవాళ్లు కారని కేసీఆర్ అన్నారు. తెలివైన రాజకీయనాయకుడు తన టర్మ్ కోసం ఎదురుచూడాలని సూచించారు. పార్టీ - ప్రభుత్వం జోడు గుర్రాల్లాగా పరుగెత్తాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు.
సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలంగాణ నీటి కార్యక్రమాలను దేశవిదేశాలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు. కరవు శాశ్వత నివారణకు మిషన్ భగీరథ పరిష్కారం చూపుతుందని చెప్పిన ఆయన... మే 30లోపు రైతుల పొలాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీనిచ్చారు. ఇంటింటికీ నీరందించకుంటే ఓట్లడగబోమని చెప్పానని కార్యకర్త ఉద్యమస్ఫూర్తిపై ఉన్న భరోసాతోనే ప్రకటన చేశానని తెలిపారు. అలాగే ఇక తెలంగాణలో కరెంట్ కోతలు ఉండబోవన్నారు. త్వరలోనే జైపూర్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం కానుందని ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ రానుందని స్పష్టం చేశారు

EmoticonEmoticon