తెలుగు రాష్ర్టాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో టీడీపీ నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీ మంత్రులు గంటా, రావెల వంటివారు తమ సుపుత్రుల నిర్వాకాలతో చిక్కుల్లో పడ్డారు. తాజాగా టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కూడా అదే అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో ఎదురైన చిక్కుల్లో ఉన్న ఆయనకు ఇది మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ కారు రేసింగులకు పాల్పడుతుండగా హైదరాబాద్ బంజారా హిల్సు పోలీసులు కేసు నమోదు చేయడంతో మంత్రిగారికి చిక్కులొచ్చాయి.
శుక్రవారం రాత్రి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న సుజనా కొడుకు కార్తీక్ పై బంజారాహిల్సు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న రాత్రి మిత్రులతో కలిసి జూబ్లీహిల్సు చెక్ పోస్టు నుంచి కార్తీక్ పంజాగుట్ట వరకు కారు రేసింగులకు దిగినట్లు సమాచారం. ఈ రేసింగుల్లో కార్తీక్ వాడిన కారు 'ఏపీ 09 సీవీ 9699' సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టర్ అయి ఉంది. మరో మూడు కార్లు, పది బైకులపై అతడి మిత్రులు వచ్చారు. అర్ధారాత్రి వేళ 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో కార్లు వెళ్తుంటే జనం జడుసుకున్నారు. కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఆర్ నగర్, మహంకాళీ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్సు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల కింద బుక్కయ్యే నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పోలీసులు వదిలేస్తున్నారు. దీంతో సుజనా కొడుకు కార్తీక్ కు పెద్దగా ఇబ్బంది లేకుండా విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

EmoticonEmoticon