శ్రీసీతారాముల కళ్యాణం వైభోగమే

05:09:00
భద్రాచలంలో పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌ -పాల్గొన్న పలువురు మంు్తల్రు రామయ్య -పెళ్లిని చూసి పులకించిన భక్తజనం -ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం -సకల దేవతలకూ ఆహ్వానం -పట్టువస్త్రాలు సమర్పించిన ఇన్‌చార్జి మంత్రి గంటా, విప్‌ మేడా -పౌర్ణమినాడు స్వామివారికి కల్యాణం -పాల్గొననున్న చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌ భద్రాచలం, మేజర్‌న్యూస్: శ్రీరామ నామస్మరణతో భద్రాచలం ఉప్పొంగిపోయింది. అద్యంతం కన్నులపండవగా సాగిన కళ్యాణోత్సవంలో జగదభిరాముడు... శ్రీరామచంద్రుడు... కళ్యాణరాముడుగా మారి.... జనకుని తనయ సీతమ్మను అభిజిత్‌లగ్నంలో కళ్యాణమాడిన అపురూప ఘట్టాన్ని చూసి భక్తకోటి పులకించిపోయారు. సీతమ్మ నొసటన కళ్యాణబొట్టు, బుగ్గన దిష్టిచుక్కను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పట్టు వస్త్రాలను వేదపండితులు, అర్చకులు ధరింపచేశారు. దశరథ రాజు తనయుడు రామచంద్రుడు చూపరులను ఆకట్టుకునేలా సర్వాభరణ భూషితుడై కళ్యాణ వేదికైన మిధిలాపురికి తన పరివారంతో చేరుకున్నాడు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ మొదలగు ఆభరణాలను ఆ వధూవరులకు అలంకరించడంతో మరింత అందానిచ్చాయి. భద్రాద్రి నలుదిక్కులా రామనామం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు మార్మోగుతుండగా, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్మిఖీ నామ సంవత్సర చైత్రశుద్ద నవమి శుక్రవారం శుభముహుర్తం అభిజిత్‌లగ్నం ప్రవేశించగానే మిథిలాపురి కళ్యాణ మండపంలో రజితసింహావాహనంపై కొలువైన సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మూడు సూత్రాలతో భక్తరామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి వైభవోపేతంగా మాంగల్యధారణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, సీతారాముల శిరస్సుల నుంచి జల్లులా పడుతుంటే భక్తులంతా ముగ్ధులై తిలకించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు మత్రోచ్ఛారణల మధ్య నయనానందకరంగా జగదభిరాముని కల్యాణ మహోత్సవం జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు కళ్యాణ మండపానికి చేరుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పించి, శ్రీసీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకోగా దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సంప్రదాయ ప్రకారం వరివట్టంకట్టి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు శ్రీసీతారామచం ద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మిథిలాస్టేడియానికి చేరుకున్నారు. పావన గోదావరి తీరాన శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా సాగింది. శ్రీరామనామస్మరణతో భద్రాద్రి మారుమ్రోగిపోయింది. నేత్రపర్వంగా సాగిన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీరామస్మరణతో భద్రాద్రి పురఃవీధులు మారుమ్రోగాయి. మిథిలా కళ్యాణ మండపంలో ఆశీనులైన భక్తకోటి జనసందోహం నడుమ శ్రీసీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తుల విగ్రహాలను ఘనంగా ఊరేగించారు.

Share this

Related Posts

Previous
Next Post »