సీఈసీకి వైకాపా అధ్యక్షుడు జగన్‌ విజ్ఞప్తి

09:58:00



పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజాస్వామ్యం అమ్ముడు కాకుండా చూడాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) నసీం జైదీకి ప్రతిపక్ష నేత జగన్‌ విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన జైదీతో భేటీ అయ్యారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు అనేది సభాపతి పరిధి నుంచి తొలగించి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చిన 10 ప్రధాన హామీలు నెరవేర్చకపోతే తర్వాత ఎన్నికల నుంచి ఆ పార్టీని బహిష్కరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంవల్లే ఈ డిమాండు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలో అధికార తెదేపా మిత్రపక్షం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదేమోనని వ్యాఖ్యానించారు. ప్రధానికి చెప్పాలనుకున్నది పోస్టు ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్‌ భేటీ అయ్యారు.

Share this

Related Posts

Previous
Next Post »