ఏపీలో రాజకీయం శూన్యం : సర్వే

05:42:00

గత రెండేళ్ల చంద్రబాబు పాలన మీద సెంటర్ ఫర్ మీడియా సెంటర్ ఒక సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఏపీ సీఎంకు తిరుగులేదని తాజా సర్వే తేల్చింది. ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేసింది. కొన్ని విషయాల్లో బాబు పాలన మీద ప్రజల్లో కొద్దిపాటిఅసంతృప్తి ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే మాత్రం బాబుకు ప్రత్యామ్నాయం లేదన్న విషయం తేలిపోయింది.

ఈ సర్వే వివరాలు చూసినప్పుడు చంద్రబాబు సంతోషించాల్సిందే. కేంద్రం నుంచి అరకొరగా అందుతున్న సహకారం.. విభజన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం.. ప్రజల్లో అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో బాబు పాలన మీద ప్రజాభిప్రాయం ఏమిటన్నది ఆసక్తి రేకెత్తించేదే. పాలన మందకొడిగా సాగుతుందన్న విమర్శలున్న వేళ.. ఈ సర్వే వెల్లడించిన వివరాలు బాబుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయనటంలో సందేహం లేదు.

బాబు పాలన బాగుందని 61 శాతం మంది చెప్పటమంటే.. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లే. బాబు సర్కారు పాలనపై ప్రజల్లో సానుకూలత 51 శాతం ఉండగా.. ఏపీలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి సమతుల్యంతో ఉందన్న అభిప్రాయం 54 శాతం మంది వ్యక్తం చేయటం గమనార్హం. ఎన్నికల సందర్భంగా బాబు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నారా? అన్న ప్రశ్నకు 59 శాతం మంది అవునని సమాధానం చెప్పటం చూసినప్పుడు బాబు పాలనకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్లే. ఇదిలా ఉంటే.. ఒక్క పోలిక దగ్గరే బాబు బ్యాచ్ తీవ్ర నిరాశకు గురి కావాల్సిన పరిస్థితి. ఏపీ సీఎంగా చంద్రబాబు ఓకేనని చెప్పిన సర్వే.. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సీఎంతో పోలిస్తే మాత్రం తేలిపోవటం ఇబ్బందికరమనే చెప్పాలి.

ఏపీ సర్కారుతో పోలిస్తే.. తెలంగాణ సర్కారే బాగా పని చేస్తుందన్నభావన ఎక్కువమంది ప్రజల్లో ఉండటం బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్లే చెప్పాలి. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు.. తన శిష్యుడు కేసీఆర్ కంటే పాలనలో వెనుకబడి ఉండటం చూస్తే.. ఎంసెట్ లో టాప్ ర్యాంకు వచ్చి.. ఇంటర్ లో ఫెయిల్ అయిన చందంగా మారిందని చెప్పాలి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సర్కారు పాలన బాగుందన్న అభిప్రాయం 43 శాతం మంది వ్యక్తం చేయగా.. ఏపీనే మెరుగ్గా పని చేస్తుందన్న అభిప్రాయం 34 శాతం మంది మాత్రమే చెప్పారు. రెండు రాష్ట్రాలు బాగా పని చేస్తున్నాయని 17 శాతం చెప్పారు. ఏపీ కంటే తెలంగాణ సర్కారే బాగా పని చేస్తుందన్న వారికి.. ఏపీ సర్కారే బాగా పని చేస్తుందని చెప్పిన వారికి మధ్య ఉన్న 9 శాతం తేడా ఎక్కువే. ఈ విషయం మీద చంద్రబాబు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Share this

Related Posts

Previous
Next Post »