అనంతపురంలో నిరవధిక దీక్షలు

22:58:00

వామపక్షాల ఆధ్యర్యంలో ప్రదర్శనలు - సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ - ఆందోళనలకు సిద్ధమౌతున్న వైసిపి, కాంగ్రెస్‌ ప్రజాశక్తి - యంత్రాంగం రాష్ట్రంలో ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశం వేడెక్కుతోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతుం డటంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఈ విషయంపై మాట్లాడక తప్పనిస్థితి ఏర్పడుతోంది. అనంతపు రంలో ఆదివారం నాడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభమైనాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయి తమ సంఘీభావం ప్రకటించారు. పలు ప్రజాసంఘాలు ఈ ఆందోళనలకు మద్దతు తెలిపాయి. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదాల సాధన కోసం ప్రదర్శనలు సాగాయి. వైసిపి, కాంగ్రెస్‌ పార్టీలూ పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమౌతున్నాయి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపికి చెందిన సీనియర్‌ నేతలతో సమావేశమైనారు. హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెబుతూనే, విమర్శలు చేయవద్దని సూచించారు. కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలకు సంబంధించి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశిం చారు. అదే సమయంలో కేంద్ర మంత్రిమండలి నుండి బయటకు వస్తే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ అక్కడక్కడ అధికార పార్టీలోనూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అధికారికంగానూ, అనధికారికంగానూ ఆ పార్టీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. తాము ఎంత సర్ధుకుపడి పోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదని చెప్పారు. కేంద్ర మంత్రులు నీతిఅయోగ్‌ అంటూ హోదా అంశాన్ని వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, హోదా ఆలస్యమయ్యే కొద్దే సమస్యలు మరింత పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, బీహార్‌ ముఖ్యమంత్రులే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.

Share this

Related Posts

Previous
Next Post »