ఛార్మి ప్రధాన పాత్రధారిణిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని రచయిత్రి మంగళగౌరీ విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో రాశారు. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళభరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పీహెచ్.డీ చేయదగిన స్థాయిలో మంగళగౌరీ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సినిమాకు కావ్యగౌరవం కల్పించిన మంగళగౌరీ అభినందనీయురాలు. 'ఇట్లు..శ్రావణీ సుబ్రమణ్యం' చిత్రంలోని డైలాగులు చూసొచ్చి, నేను సినిమా చేస్తే డైలాగులు మీరే రాయాలని పూరి దగ్గర మాట తీసుకున్నాను. ఉత్తమ సంభాషణలకుగాను ఆ చిత్రం నంది అవార్డును కైవసం చేసుకుంది. 'అనుకోకుండా ఒక రోజు', 'జ్యోతిలక్ష్మి' చిత్రాలు ఛార్మీ కెరీర్‌లో నిలిచిపోతాయి. ఇదే కాంబినేషన్‌లో 'జ్యోతిలక్ష్మి పార్ట్ 2' కూడా రావచ్చేమో' అని అన్నారు. 'పుస్తకంతో మొదలైన 'జ్యోతిలక్ష్మి' సినిమా పుస్తకంతోనే ముగుస్తుంది.
ఈ సినిమాను పూరిగారు ఎంతో స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా జ్యోతిలక్ష్మి అని పిలుస్తున్నారు' అని కథానాయిక ఛార్మి చెప్పారు. 'మల్లాదివారితో మాట్లాడిన తర్వాతే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక కన్యాశుల్కం అని నేను జ్యోతిలక్ష్మి గురించి చెబుతాను. ఈ సినిమా చూసిన ప్రతి పురుషుడు చాలా నేర్చుకోవాలి. తమ భార్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. వారిని ప్రోత్సహించాలి. ఈచిత్రంలోని క్లైమాక్స్ నన్ను కదిలించింది. భవిష్యత్‌లోనూ పూరిజగన్నాథ్ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్తకాలు రాయాలనుకుంటున్నాను' అని రచయిత్రి మంగళగౌరీ అన్నారు. ఈ కార్యక్రమంలో టార్జన్, గాయత్రి, అపూర్వ, సునీల్‌కశ్యప్, శాండీ, పి.జి.విందా, సత్యదేవ, ఆకాష్‌పూరి తదితరులు పాల్గొన్నారు. '40 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'మిస్టర్ పరాంకుశం' కథను 20 ఏళ్ళ క్రితం నేను సినిమాగా తీయాలనుకున్నాను. ఏడేండ్ల కిందట ఛార్మితో కలిసి ఈ సినిమాను తీద్దామనుకున్నాను. ఫైనల్‌గా సినిమా తీశాం. ఈ క్రమంలో జరిగిన ప్రతి విషయంతోపాటు సినిమాపై మంగళగౌరీ పుస్తకం రాయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో మా సినిమాపై మరింత గౌరవం పెరిగింది. ఛార్మి పాత్రను మధురవాణితో పోల్చడం మరింత సంతోషంగా ఉంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన భరణిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమాపై పుస్తకం రాయడమనేది మా అందరికి ఓ స్ఫూర్తినిస్తుంది. అవార్డులు వచ్చిన దానికంటే చాలా ఆనందంగా ఉంది' అని వీడియో సందేశంలో పూరీజగన్నాథ్ తెలిపారు.

EmoticonEmoticon