నవ్యాంధ్రకు కేంద్రం నుంచి అరకొర సహాయమే అందిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన ‘నీరు - ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిల్లిపాలెంలో రూ. 10కోట్లతో నిర్మించిన రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం పట్టణంలో రూ. 15కోట్ల వ్యయంతో నిర్మించనున్న కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు, రాజధానికి నిధులను ఇవ్వాల్సి ఉంది. సాయం కొంతే జరిగింది. ఇంకా ఎంతో జరగాల్సి ఉంది’’ అని తెలిపారు. నవ్యాంధ్ర తలసరి ఆదాయం రూ.95వేలుంటే తెలంగాణకు రూ.1.29 లక్షలు ఉందన్నారు.
ఆదాయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ 11శాతం వెనుక ఉందని తెలిపారు. ‘‘చాలా విషయాల్లో మనం వెనుకబడ్డాం. అందుకే ఇతర రాషా్ట్రలతో సమానంగా ఎదిగే వరకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం’’ అని తెలిపారు. రెండో విడత రుణమాఫీకి ఈ నెలలో రూ.3,200కోట్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకున్నా ప్రజల కోసం ఈ పని చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.3వేల చొప్పున ఇస్తామని, నాలుగేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి డ్వాక్రా మహిళ నెలకు రూ. 10వేలు ఆదాయం సమకూరేలా ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. విద్యుత్ విషయంలో మిగులు సాధించామని, ఈ-పాస్ ఏర్పాటుతో రేషన్ దుకాణాల్లో అవకతవకలు నిర్మూలించామని చెప్పారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. మెట్ట భూముల్లో సాగుకు వీలుగా 15వేల రెయిన్‌గన్స్ ఆర్డర్ ఇచ్చామన్నారు.

EmoticonEmoticon