కాంగ్రెస్ కన్ను తెలుగు రాష్ట్రాలపై ఉందిప్పుడు. ఓ వైపు యూపీ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తూనే తెలుగునాట జరిగే ఎన్నికలపైనా అధినేత్రి దృష్టి సారించారుట. 2019 ఎన్నికల గురించి దిల్లీ అధిష్ఠానం ఇప్పటినుంచే పాచికలు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చీ.. ఆ ప్రాంతంలో వెనకబాటు తనానికి కారణమేంటో అర్థంగాక మల్లగుల్లాలు పడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఏదైతేనేం ఉత్తమ్ కుమార్ ని టి-కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పించి కొత్త రక్తం ఎక్కించాలని ప్లాన్ చేశారు. తెలంగాణలో కీలకనేతలంతా గులాబీ గూట్లో చేరిపోవడంతో ఈ సన్నివేశం తలెత్తింది. రేసులో అరడజను మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌తోపాటు నటి విజయశాంతి, మల్లు భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ మొదలైనవారి పేర్లు పరిశీలనలో ఉన్నారు. అయితే ఇంతమందిలో అందరినీ రాములమ్మ డామినేట్ చేసేస్తోందని, సినీగ్లామర్ ముందు అన్నీ పరేషాన్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయశాంతికే ఎక్కువ సపోర్టునిస్తున్నారని, అలాగే అజార్ పేరును ఆయన ప్రతిపాదించారని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మళ్లీ యాక్టివ్‌గా కనిపించని విజయశాంతికి ఏ కోణంలో పగ్గాలు అప్పజెబుతారన్న వాదనా వినిపిస్తోంది. ఏదేమైనా రేసులో రాములమ్మ టాప్ పొజిషన్‌లోనే ఉంది ఇప్పటికి.

EmoticonEmoticon