పాలారులో చెక్ డ్యాం ఎత్తు పెంచుతున్న ఆంధ్రప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ నేతృత్వంలో మంగళవారం వేలూరులో ఆందోళన జరుగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు. వేలూరు జిల్లా డీఎంకే కార్యవర్గం అత్యవసర సమావేశం ఆదివారం ఉదయం కాట్పాడి ఎమ్మెల్యే దురైమురుగన్ అధ్యక్షతన జరిగింది. తమిళనాడు జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా పాలారులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాం ఎత్తు పెంపు పనులు అడ్డుకోలేని తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తర్వాత విలేకరులతో దురైమురుగన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే విషయాలపై అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం పాలారులో చెక్‌డ్యామ్ ఎత్తు పెంపు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయలేదని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడానికి కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు. పాలారులో ఆంధ్ర ప్రభుత్వం చెక్‌డ్యామ్ ఎత్తును పెంచితే అది తిరువణ్ణామలై, కాంచీపురం, వేలూరు జిల్లా రైతుల జీవనాధారాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వేలూరు కలెక్టరు కార్యాలయం వద్ద డీఎంకే కోశాధికారి స్టాలిన్ అధ్యక్షతన మంగళవారం ఆందోళన జరుగుతుందని, గతంలో హొగినెకల్ ఉమ్మడి తాగునీటి కోసం జరిగిన ఆందోళనలో 25 వేల మంది పాల్గొన్నారని, ప్రస్తుత సమస్య మూడు జిల్లాల ప్రజలకు సంబంధించింది కావడంతో ఈ ఆందోళనలో లక్ష మంది పాల్గొంటారన్నారు. సమస్యకు పరిష్కారం లభించేవరకు ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎంకే వేలూరు కేంద్ర జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్, నగర కార్యదర్శి, ఎమ్మెల్యే కార్తికేయన్, కేంద్ర జిల్లా ప్రిసీడియం ఛైర్మన్ మహ్మద్ సఖి, నగర ప్రిసీడియం ఛైర్మన్ విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు.
EmoticonEmoticon